Friday, March 9, 2018

చిట్టి కథ- context- సెంటిమెంట్


Given context:

వాళ్ళు రక్త సంబంధీకులే కానీ మాట తేడా వచ్చి పౌరుషాలు పెరిగి బంధాలు క్షీణింపజేసుకుని ఒకరి రక్తం మరొకరు కళ్ళ చూస్తామనుకునే స్థాయికి చేరుకున్నారు. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి పడితే చటుక్కున మండి పోతోంది. ఒకరోజు ఉదయాన్నే పొడవాటి కర్రతో ఇంటి వైపు దూసుకువస్తోన్న తమ్ముడిని చూసి అన్న ఇంట్లో వాళ్ళు ఆందోళనకు గురయ్యారు....
     

My Story:
సెంటిమెంట్
             కర్రతో తలుపుకొట్టిన వెంటనే వదిన వచ్చి, “ఏమిటి గోవిందూ, ఈ వాలకం? ఏమిటీ ఆవేశం?” అని ప్రశ్నించింది. “అడ్డం లే, వదినా, ఇవ్వాళ నేనో మీ ఆయనో తేలిపోవాలి”, అన్నాడు గోవిందు ఆవేశంగా. “ఎంత మాట, ఎంత మాట అనేశావు? తండ్రి తరువాత తండ్రిలాంటి వాణ్ణి, ‘మీ ఆయన’, అని అనడం సబబేనా?” ప్రశ్నించింది వదిన. “అలాంటి వాడే అయితే, నాన్న పోవగానే ఆస్తి పంచుకొవడమేమిటి? నిన్న, నాకు పిల్లలు లేకపోవడానికి కారణం- నేను ఆడంగోణ్ణి అని ప్రచారం చేస్తున్నాడు. చీమూ, నెత్తురూ ఉన్నావాడెవడైనా ఈ మాట విని ఊరుకోగలడా, చెప్పు?” అని బాధని వెళ్ళగక్కుకున్నాడు గోవిందు. “మీ అన్నయ్య ఎలాగుంటేనేం? నేను నీకు తల్లి తరువాత తల్లిలాంటిదాన్ని కదా! నేను చెప్తానులే. నువ్వు వెళ్ళిరా”, అందొదిన. “ఊహూఁ, వీల్లేదు”, అన్నాడు మరిది. “గోవిందూ, పెళ్ళి అయినప్పుడు నీకు పన్నెండేళ్ళు. నిన్ను నా పెద్ద కొడుకని ఇన్నాళ్ళూ అనుకున్నా. నువ్వు నా పసుపు కుంకుమలని తుడిచేస్తావా?” అని చెంగుతో కళ్ళు తుడుచుకుంది వదిన గారు.
              “అబ్బే, నా ఉద్దేశ్యం అది కాదొదినా, నీ బిడ్డనైన నన్ను అన్నయ్య అనరాని మాటలంటూంటే నీకు మాత్రం బాగుంటుందా చెప్పు?” అని మెత్తబడ్డాడు మరిది. “నువ్వింటికి వెళ్ళిరా. నీకు మీ అన్నయ్యచేత క్షమాపణ చెప్పించే పూచీ నాది. సరేనా?” అంది వదిన అభిమానంగా. సెంటిమెంట్ తోబాణం వేశాక తగలకుండా పోతుందా? మరిది వెనుదిరిగాడు. దారిలో ఉలిక్కిపడ్డాడు- తనకీ, అన్నయ్యకీ మూడేళ్ళు తేడా. అన్నయ్యకి పెళ్ళయ్యే సమయానికి పాతికేళ్ళు. అంటే, తనకి ఇరవై రెండు, పన్నెండు కాదు. ఏమిటిలా అబద్ధాలాడి మభ్యపెట్టింది? ఎంత మోసం! కానీ, ఆమె మాటలలో నిజముంది. ఆమె తనతో ఎప్పుడూ తల్లిలాగే ప్రవర్తించింది. తన భార్య కూడా ఆమె ఎంపికే! అందుకని, ఓ అవకాశం ఇద్దాంలెమ్మని ఇంటికెళ్ళాదు గోవిందు.
              “హమ్మయ్య! వాడు వెళ్ళాడు కదా!” అని బయటకొస్తూ నిట్టూర్చాడు సింహాద్రి. “చాల్లెండి మీ వేషాలు. మామయ్య గారు పోయినప్పుడు ఆస్తి పంపకాలొద్దన్నా వినిపించుకోలేదు. ఇప్పుడు పాపం గోవిందు మీద చెడ్డ ప్రచారమేమైనా బాగుందా? నోటికొచ్చినట్లు మాటలాడడాలూ, తరువాత దాక్కోడాలూ ఎందుకు? వెళ్ళి అతణ్ణి క్షమాపణ కోరండి”, అని ఆజ్ఞాపించింది వదిన. “పిల్లలు లేని ఆడదాన్ని గొడ్రాలని ఎలా అంటారో, మగ వాళ్ళని..”, అని ఏదో చెప్పబోతున్న భర్తని ఆపి, “మీ నోట నిండా కుళ్ళు కాలవ నీళ్ళే ఉన్నాయి. సొంత తమ్ముణ్ణి అలాంటి మాటలనడానికి సిగ్గు పడాలి. మీరు వెళ్తారా, నేనూ పిల్లలూ, నా పెద్దకొడుకు దగ్గరికి వెళ్ళిపొమ్మంటారా?” అని సెంటిమెంట్ తో కూడిన అల్టిమేటం ఇచ్చింది గోవిందు వాళ్ళ వదిన. ఆమె అన్నంత పనీ చేస్తే, తన పరువే పోతుంది గనుక కాస్సేపు అలోచించి, తనలోని కుళ్ళుని కడుక్కుని, గోవిందుండే ఇంటికి దారితీశాడు అన్న.
******

No comments: