‘వృద్ధ పురుషా’
“మహేష్ ని ఇవ్వాళ చూశాను. ఆరోగ్యంగానే
ఉన్నాడు. నీ గురించి అడిగాడు. నిన్ను వదిలి వెళ్ళినందుకు, పాపం, బాధ పడ్డాడు.
నువ్వొప్పుకుంటే నీతో జీవితం పునఃప్రారంభం చేద్దామనుకుంటున్నాడు”, అని ముగించింది
అశ్వని. ప్రేమ మాత్రం తొణక లేదు. “ఊహూఁ”, అని ముక్తసరిగా జవాబిచ్చింది. తన మదిలో
అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి, గతం గుర్తుకొచ్చి.
తన వెంట పడ్డ మహేష్ అంటే ఇష్టం
పెంచుకుంది ప్రేమ. తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోకపోతే, వాళ్ళని, పుట్టింటిని వదిలి
వచ్చి అతణ్ణి పెళ్ళి చేసుకుంది. పెళ్ళైన కొన్నాళ్ళకే ఆమెకు టీబీ వచ్చింది. రోగిష్ఠి
కోడలిని తెచ్చినందుకు మహేష్ ని అమ్మానాన్నలు తిట్టిపోశారు. ఒక చలికాలపు రోజున
మహేష్ కి దగ్గు పట్టుకుంది. కోడలి నుంచి అది పాకి ఉంటుందని వాళ్ళు రెచ్చిపోయారు.
అమ్మానాన్నలా, భార్యా? అనే చిక్కు ప్రశ్నను మహేష్ మీదికి సంధించారు. అష్టకష్టాలూ
పడి, తననింతటి వాణ్ణి చేసిన తల్లిదండ్రుల పక్షాన నిలిచాడు మహేష్- చదువుకున్న భార్య
ఎలాగోలా నెట్టుకు రాగాలదన్న ధైర్యంతో. అసలే జబ్బు మనిషైన తనను వదిలి వెళ్ళద్దని
చేయి పట్టుకునెంతగానో ప్రాధేయ పడింది తను. అతను చేయి విదిలించుకుని, వెళ్ళిపోయాడు.
చేసేది లేక, తను వదిలొచ్చిన పుట్టింటికెళ్ళి, ఆరోగ్యవంతురాలై, ఉద్యోగం చేసుకుంటూ
కాలం వెళ్ళబుచ్చుతోంది. ఇప్పుడు మహేష్
తిరిగొచ్చి, బాధ పడితే, కలిసిపోవడమేనా?
అశ్వని, “ఏం ఆలోచించావు ప్రేమా?”
అన్న మాటకి వర్తమానంలోకొచ్చిన ప్రేమ, “వదులుకున్న వారిని కలుపుకోవచ్చు...విదిలించి వదిలించుకున్న
వారి దరి చేరాలంటే మనసు అంగీకరించాలి. అప్పుడు కన్నవారి ప్రేమ ముందు
కట్టుకున్నదాని కష్టం కొట్టుకుపొయింది. ఇప్పుడు వాళ్ళు పైలోకాలకి వెళ్ళాక, ఈ వృద్ధ
పురుషుడు చేతులు చాచి రమ్మంటే, పడ్డ పాట్లు మరచిపోయి, పరుగెత్తే క్షమాగుణం నాకు
లేదు”, నిశ్చలంగా అంది ప్రేమ.
*********
No comments:
Post a Comment