Monday, October 16, 2017

చిట్టి కథ- Keywords- " చెమ్మగిల్లిన ఆ కళ్ళు వినూత్న అనుభూతికి సాక్ష్యాలు... "requirement- ఆర్ద్రత"- అపార్థం

“లల్లీ, ఏమిటి ల్యాండ్ లైన్ ఎత్తవు?” కోపంగా అన్నాడు శంకర్. ‘అబ్బే, లేదండీ, అది డెడ్ అయ్యింది”, అని కంగారుగా జవాబిచ్చింది లలిత. విషయం చెప్పేసి ఫోన్ పెట్టేశాడు శంకర్. సాయంత్రం ఇంట్లోకి వస్తుండగా ల్యాండ్ లైన్ మోగడం గమనించాడు. అలసిపోయున్న ఆటను విసుగ్గా, “ఇదెలా మోగుతోంది? పొద్దున్నే డెడ్ అయ్యిందన్నావుగా?” అన్నాడు. “వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు లేనట్టున్నారు, మూడింటికొచ్చి రిపేర్ చేసేశారు”, జవాబిచ్చింది లలిత. కొన్నాళ్ళకి ఆఫీసులో తలనొప్పి వచ్చిన శంకర్ పదకొండు గంటల ప్రాంతంలో ఇల్లు చేరాడు.

గేటు దగ్గర వాచ్ మాన్, “అయ్యా, అమ్మగారు ఎప్పటిలాగే బయటికెల్లారు కదండీ... తాలాలు మీకాడ ఉన్నాయి కదండీ?” అనడిగాడు. తెల్లబోయిన శంకర్ ఆ విషయం కనపడనీయకుండా, “ఆ, ఉన్నాయిలే, అని చెప్పి, పేరుకి ఫ్లాట్ కి వెళ్ళినట్టే వెళ్ళి, కొంత సేపటికి బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చాక ఆ సంగతి అడిగితే, “అయ్యో, కొంచెం లేటుగా వెళ్ళుంటే మీరు కనిపించి ఉండేవారు...అరెరే.. వచ్చే వారం ఆడబడుచు గారొస్తున్నారు కదా, చీర కొనడానికి వెళ్ళాను. చూస్తారా?” అని ఉత్సాహంగా అడిగింది. “అక్కరలేదులే”, అని విసుగ్గా అన్నాడు శంకర్. రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. వాచ్ మాన్ అన్న ఒక్క మాటకి ఇంకా తగిన వివరణ దొరకలేదు-‘ఎప్పటిలాగే’. సంగతేమిటో చూద్దామనుకున్నాడు. మర్నాడు ఆఫీసుకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి కాస్త దూరంగా కాపు కచాడు. పదిన్నరకి బయలుదేరి ఆటోలో ఎక్కడికో వెళ్తోంది లలిత. తను కారులో రహస్యంగా వెంబడించాడు. ఆటో అనాథ శరణాలయం ముందు ఆగింది. ‘ఈమె వేరెవరితోనో కన్న బిడ్డను ఇక్కడ పెంచట్లేదు కదా!’ అనుమానపు పచ్చకామెర్లు పెరిగాయి. అటో ఇటో తేల్చుకోవడానికి తిన్నగా వార్డెన్ గదికి వెళ్ళి తన గురించి అడిగాడు. “లలిత గారాండీ! చాలా మంచి వారండీ! ఆవిడకి పిల్లలు లేరని ఇంతమంది పిల్లలకి తల్లిలా ఉంటారు. మామూలు రోజుల్లో కుదరకపోతే రారు గానీ సెలవుల్లో తప్పకుండా వచ్చి, వాళ్ళకి బోలెడు కథలు చెప్పి, చిత్రలేఖనం వగైరా నేర్పిస్తుంటారు. ఇక్కడ ఉన్న పురి విప్పిన నెమలి పెయింటింగ్ ఉంది చూశారూ... ఆవిడ మార్గదర్శకత్వంలో ప్రణిత అనే అమ్మాయి గీసింది. ఆవిడ రాకపోతే పిల్లలకే కాదు, నాకు కూడా బోర్ కొడుతుంది”, అని వార్డెన్ చెప్పగానే మనసు చిన్నబుచ్చుకున్నాడు శంకర్. ఆ రోజు రాత్రి ఈ విషయం చెప్పి, “నాతో ఎందుకు చెప్పలేదు?” అని అడిగితే, లలిత, “అనాథ పిల్లల మీద మీకు మంచి అభిప్రాయం లేదు, అచ్చం సమాజానికి మల్లే. చుట్టాల్లో దత్తత తీసుకోవడం నాకిష్టంలేదు. అందుకనే, వెళ్ళి అభం శుభం తెలియని ఆ చిన్నారులకి మంచితనం నేర్పి వస్తున్నా!” అంది. “పిల్లలంటే నీకు అంత ఇష్టమైతే మనం ఓ పిల్లని ఆ ఆశ్రమం నుండి తెచ్చుకుని, పెంచుకుందామా?” అని అడిగాడు శంకర్. అనుకోని స్పందన భర్త నుండి వచ్చేసరికి ఆనంద బాష్పాలు రాల్చింది లలిత. చెమ్మగిల్లిన ఆ కళ్ళు వినూత్న అనుభూతికి సాక్ష్యాలు!
*****

No comments: