Monday, October 9, 2017

" ఈ చిట్టికథకు ముగింపు మీదే " - ఆశ్రమం


Given Story:
కారు శరవేగంగా పరుగెడుతోంది. తండ్రీ కొడుకులిద్దరి మధ్య నిశ్శబ్దం...
డ్రైవింగ్ సీట్లో కొడుకు.
" ఒకసారి కారు ఆపు బాబూ "
" ఎందుకు "

ఒంటేలు చూపించాడు తండ్రి.
    చిరాకు పడుతూ కారు ఒక
ప్రక్కగా ఆపి " తొందరగా రా...
చీకటి పడుతోంది " అన్నాడు కొడుకు.
    తుప్పలచాటుకు
వెళ్ళిన తండ్రి పదినిమిషాలు అయినా రాకపోవడంతో కారు దిగి నలువైపులా వెతికాడు కొడుకు...

ఆశ్చర్యం...తండ్రి ఎక్కడా కనిపించలేదు ! ................
My conclusion:


ఆశ్రమం
కంగారు పడుతున్న ఆ అబ్బాయికి అల్లంత దూరంగా జన సంచారం కనిపించింది. పోయి చూస్తే, నది ఒడ్డున ఉన్న ఒక యోగాశ్రమం లాంటిది కనిపించింది. ఇదివరలో రాకపోయినా, ఎక్కడో చూసినట్టుంది ఆ పెద్దాయన సుపుత్రుడు రక్షిత్ కి. అలా నడుస్తూ ఉంటే గుర్తుకొచ్చింది. ధ్యానం, యోగా, భగవచ్ఛింతన, తదితర ప్రక్రియలతో మనసుని గెలుచుకునేందుకు పెట్టబడినది ఆ యోగాశ్రమం. ఇంచుమించు నెల రోజుల క్రితం ఆదివారం పేపర్లో దాని గురించి వేశారు. అప్పటి నుంచీ అక్కడికి తీసుకెళ్ళమని తండ్రి చంటాడిలా గోల చేశాడు. పని హడావుడిలో తీసుకెళ్ళలేక పోయాడు కొడుకు. ఖచ్చితంగా తండ్రి అక్కడే ఉండుంటాడని ఆరా తీశాడు. నిజమే, తండ్రి అక్కడే ఉన్నాడు. కానీ తేడా ఏమిటంటే, ఆయన మోహంలో ప్రసన్నత, ప్రశాంతత. ఇన్నాళ్ళూ రెండవ బాల్యంలో ఉన్నట్టు గోల చేసేవాడే! “రక్షిత్, నువ్వేమి ఆలోచిస్తున్నావో నీ తండ్రిగా నేను గ్రహించాగలను. నువ్వూ, మాధురీ నన్ను బాగా చూసుకుంటున్నారు కానీ, నాకు కావలసిన సత్కాలక్షేపం నాకు దొరకక మధన పడేవాణ్ణి. అప్పుడప్పుడు మారాం చేసేవాణ్ణి కూడా! పేపర్లో చదివిన తరువాత నాకు కావలసినది ఇదేనని సంతోషించాను. నేనెక్కడ కష్టపడతానో అని మీరు ఒప్పుకోరు. ఈ దారెంట వెళ్తూంటే దిగిపోవాలనిపించింది. అంతే! మీ అమ్మ పోయాక నేను ఎంత ఒంటరితనాన్ని అనుభవించానో మాటల్లో చెప్పలేను. ఇక్కడ నా ఈ వానప్రస్థాశ్రమంలో ఒంటరితనం ఉండడానికి అవకాశం లేదు. నా మాట విని, వెళ్ళి రారా!” అని ప్రాధేయపడ్డాడు తండ్రి. అయన మొహంలో ప్రశాంతత అలాగే ఉండాలని కోరుకుంటూ, కారు ఉన్న దగ్గరికి బయల్దేరాడు రక్షిత్.

*****

No comments: