Thursday, October 19, 2017

చిట్టి కథకి ముగుంపు మీదే - చూసినవన్నీ..

Given Story:
" నానింక సెయ్యలేను బావూ "
" అలా అంటే ఎలా చిట్టెమ్మా"
" మీరు పుట్టినప్పట్నుండీ మీ ఇంట్లో పని సేత్తన్నాను కదా. .
ఇక నాకు ఓపిక నేదు... నాకు
సెలవిప్పించండి "
" అది కాదు చిట్టెమ్మా... నీ అంత నమ్మకస్థులు మాకు ఎక్కడ దొరకుతారు ?"
" ఏం నమ్మకాలో ఏమో...మనుసులు పెద్దయితే మనసులు పెద్దవ్వాలి కద బాబూ "

" ఇప్పుడేమయింది చిట్టెమ్మా "
" పెదబాబుగోరు కాలం సేసినా  అంతా తానై అమ్మగోరు మీ పెళ్ళి సేసినారు. కొత్త కోడలమ్మ
ఇంట్లో కొత్తగా అడుగెట్టినారు.... సంతోసమే... అయితే పాత సామానూ పాత మడుసుల్నీ
సీదరించుకుంటే ఎలా? "
" నిన్ను బాధ పెట్టారా ?"

" నాను దులిపేసుకునే రకాన్ని.. శాంతమ్మ గోరిని సిన్నసూపు సూస్తే నాను భరించలేను బాబూ...ఎలా బతికినారు పెద్దమ్మ గోరూ... నాను ఈ ఇంట్లో ఇక ముందర పని సెయ్యాలంటే పెద్దమ్మ గోరు నిత్తెం సిరినవ్వులు సిందించాల..."

My conclusion:
చూసినవన్నీ..
“వివరాలు చెప్పు”, అలోచిస్తూ అడిగాడు చినబాబు. “ఓ వారం రోజుల కితం సున్నుండలు సేసేరా? నాక్కూడా ఎట్టేరు కదా”, అని ఆగింది చిట్టెమ్మ. చినబాబు తల పంకించాడు. మళ్ళీ అందుకుంటూ, “అమ్మగోరు నన్ను ఓ రొండుండలు పట్రమ్మంటే, ఒట్టుకెల్తన్నాను. దారిలో సిన్నమ్మగోరు అడ్డు తగిలి, “ఎవరికి, ఏమిటి”, అని అడిగి, అమ్మగోరికి ససేమిరా ఇయ్యకోడదన్నారండీ. పెద్దోల్లని నేనేం అడ్డగిస్తాను? ఎల్లిపోనాను”, అంది చిట్టెమ్మ. చినబాబు నిట్టూర్చాడు. “ఇంకా?” అని అడిగాడు. “సిన్నమ్మగోరు పెద్దమ్మగోరిని నడుం కూడా వాల్సుకోనీయడంలేదు బాబూ! రెండు మూడు రోజులు గమనింసినాను- ఏటంటే, అమ్మగోరిని సిన్నమ్మగోరు తమ సెప్పుసేతల్లో ఒట్టుకోడానికి పెయత్నిస్తన్నారయ్యా! పడుక్కున్న పెద్దమ్మగోరిని లెగ్గొట్టి, “అత్తయ్యా, నడవండి”, అని ఆర్డర్లు ఏత్తన్నారయ్యా! మీ ఉప్పు తిని, అమ్మగోరు బాదపడతాంటే సూస్తూ కూకోలేనండయ్యా! సెలవిప్పిత్తే బయల్దేర్తానండయ్యా”, బాధగా అంది చిట్టెమ్మ. చినబాబు నవ్వాడు. “ముందొచ్చిన సెవులకంటే యెనకొచ్చిన కొమ్ములు వాడంట! మీరిలా మారతారని కల్లో కూడా ఊయింసలేదు. ఎల్లొత్తా బావూ”, అని బయలుదేరబోయింది. వస్తున్న నవ్వు ఆపుకుంటూ, “ఆగు చిట్టెమ్మా! నీకు తెలియని విషయమొకటుంది. అమ్మకి ఈ మధ్యే షుగర్ వచ్చింది. అందుకని తీపి పదార్థాలు తినకూడదు. అందుకే ఆ రోజు సాత్విక నిన్ను అడ్డుకుంది. రోజూ నడుస్తే వ్యాధి ఎక్కువ కాకుండా ఉంటుందని డాక్టర్ చెప్పారు. అమ్మకి వాకింగ్ అంటే పెద్ద శ్రద్ధ లేదు గనుక టైం ప్రకారం తన చేత వాకింగ్ చేయించమని అమ్మే సాత్వికకి ఆర్డరేసింది. సాత్విక పేరుకి తగ్గ సాత్వికురాలు. అమ్మ చిరునవ్వు చిందించడానికే ఈ పనులన్నీ. నువ్వు చూసినవన్నీ నిజాలు కానే కావు. కావాలంటే అమ్మని అడుగు. ఇప్పటికి లేచి లోపలకి నడు”, అన్నాడు చినబాబు.
*****

No comments: