Monday, October 16, 2017

చిట్టి కథ- Keywords- " మధ్యలో జోక్యం చేసుకుంటున్నందుకు మన్నించండి " అని వినిపించింది గుంపులో నుండి ఓ స్వరం..- అవసరమైన సాయం

ఉద్యోగానికి వెళ్ళే దారిలో బస్సుస్టాప్ దగ్గర అనూరాధ ఓ గుంపును గమనించింది. స్వతహాగా నాయకత్వ లక్షణాలున్న మనిషి గనుక ‘నాకెందుకులె’మ్మనకుండా కారునాపి రోడ్ దాటడానికి యత్నించింది. నేల మీద ఒక స్త్రీ పడిపోయుంది. చుట్టుపక్కల వాళ్ళు ఆమెకు స్పృహ తెప్పించడానికి నీళ్ళూ, సోడా వగైరాలు పోస్తున్నారు. “ఎవరో ఒకరు 108కి ఫోన్ చెయ్యండి”, అని మొబైలులోతను ఎవరితోనో మాట్లాడుతూ ఆదేశాలిస్తున్నాడొకాయన. 

అందరూ ఎంత గట్టిగా మూగి ఉన్నారో గాని ఆమెను స్పృహ తప్పినామె దగ్గరకు వెళ్ళే అవకాశం ఇవ్వలేదు. ఈ లోగా మూగిన మనుషుల హడావుడి ఎక్కువయ్యింది. ఇక లాభం లేదనుకుని, “మధ్యలో జోక్యం చేసుకుంటున్నందుకు మన్నించండి ", అంది గొంతుక పెద్దది చేసి. జనాలు నిశ్శబ్దంగా ఆమె వంక చూశారు. “నేను డాక్టర్ని. దయచేసి ఆమెను పరీక్ష చేసేందుకు అవకాశమివ్వండి”, అంది నెమ్మదిగా. జనాలు దారి వదిలారు. “ఈవిడ స్పృహ తప్పి ఎంతసేపయ్యింది?” అంది వాళ్ళతో. “అరగంట పైగానే అయ్యింది”, అందొకావిడ గుంపులోంచి. ఒక్క క్షణం అలోచించి, “అవిడేమైనా తన పరిస్థితి గురించి ప్రస్తావించారా?” అడిగింది. “ముందు కడుపులో నొప్పి అన్నారు, తర్వాత ఊపిరి గట్టిగా పీల్చారు, తరువాత ఉన్నట్టుండి కూలబడిపోయారు”, అందావిడ. అనూరాధకి వెంటనే అర్థమైపోయింది. తన ఆసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ ని రప్పించి రోగిని వెంటనే తరలింప జేసింది. ఆవిడ ఫ్రెండ్ ని కూడా రమ్మంది. “ఆవిడకి స్త్రీలకు వచ్చే గుండెనొప్పి వచ్చింది. మీరు వస్తే ఆవిడకిమనసు నెమ్మదిగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ నెంబర్లు తెలిస్తే చెప్పండి.. కబురు పెడదాం”, అని తన ఐ-20 కారుకేసి నడిచింది అనురాధ.
****

No comments: