“రాజా- రాణి సంపన్నులైన ఆదర్శ దంపతులు.
వాళ్ళకుండే ఒకే ఒక కొరత పిల్లలు లేకపోవడం. రాజా ఎవరైనా దత్తత తీసుకుందామంటాడు;
రాణి ఒప్పుకోదు, ‘మీకుండే విలువల విలువ వాళ్ళకి తెలియకపోవచ్చ’ని. లక్ష్మి అనే
అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తుంది. రెండవ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకపోయినా, తను ఎంతగానో
ప్రేమించే భార్య కోరిన కోరిక కోసం ఒప్పుకుంటాడు రాజా. లక్ష్మికి సవతంటే ఇష్టంలేక రాణిని ఇంట్లోంచి వెళ్ళగొట్టిస్తుంది.
కట్ చేస్తే ముసలి వయసులో ఉన్న రాణి ఒక అనాథని చేరదీసి అతని పంచన ఉంటుంది. ఒక రోజు ఆమె
తాయిలాలమ్మి వస్తుంటే ఒక ఆక్సిడెంట్ ని చూస్తుంది. ఒక బెంజ్ కార్ కింద చిరుగు
పాతల్లో ఉన్న ఒక ముసలామె పడిందని తెలుసుకుంటుంది.
తీరా చూస్తే ఆమె లక్ష్మి. వెంటనే హాస్పిటల్లో చేర్పించి,
డాక్టర్ ని కలుస్తే, ఆమెకు మెదడు మీద పెద్ద దెబ్బ తగిలిందని, వెంటనే ఆపరేషన్
చేయాలనీ చెప్తాడు. పేదరాలైన లక్ష్మి దగ్గర డబ్బులుండడం కల్ల అని గ్రహించి, ‘ఖర్చంతా నేనే
భరిస్తాను... ముందు పని కానివ్వండి’, అంటుంది చేతి బంగారు గాజులు తీసి
అందిస్తూ. వింతగా వాటి వైపు చూస్తున్న డాక్టర్ తో, ‘ఒక్కో గాజూ రెండున్నర తులాలు. నలుగు
గాజులకి పది తులాలు. మేలిమి బంగారం. మా అయన ప్రేమకు గుర్తుగా నా వద్ద ఇవే ఉన్నాయి’,
అంటుంది. డబ్బులున్న రాజా ఏమయ్యాడు? లక్ష్మి ఎందుకు పెదరాలయ్యింది? అసలు రాణికి ఆ
అనాథకి ఎలా కుదిరింది? చివరికేమౌతుంది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు సినిమాలో
ఉంటాయి. టూకీగా ఇదండీ కథ. మీకు నచ్చినట్టే కదా ప్రొడ్యూసర్ గారూ”, అన్నాడు కథకుడు కహానీ
రావు. ప్రొడ్యూసర్ గంభీరంగా అలోచించి, “ఇదేదో ఎనభయ్యో దశకం కథలా ఉందయ్యా... ఈ
రోజుల్లో ఎవడు చూస్తాడు?” అని అడిగాడు. “కరెక్ట్ గా క్యాచ్ చేశారు సార్... ఇది
ఎనభయ్యో దశకం చివర్లో వచ్చిన ‘జీవన జ్యోతి’ అనే సినిమా చూసి ప్రభావితమయ్యింది. ఇంతకీ,
మీరు తీయబోయే నెక్స్ట్ సినిమాకి నేనేనా స్టోరీ రైటర్?” అన్నాడు కహానీ రావు. “నాకు
ఇన్స్పిరేషన్ కన్నా ఒరిజినల్ అంటేనే ఇష్టం. టూకీగా చెప్పాలంటే, ఇంక మీదట ఇటువంటి
చెత్త రీమిక్సులతో నన్ను కలిసే ప్రయత్నం చేయకు”, అన్నాడు ప్రొడ్యూసర్.
**************
No comments:
Post a Comment