తండ్రి మనసులోని ఆవేదన
“సిచ్యుయేషన్ ఇది: హీరోయిన్,
అంటే మీ కూతురు, చిన్న ఉద్యోగం చేసే వాణ్ణి ప్రేమిస్తుంది. వాడు మీ ఆస్తులకి ఆశపడి
మీ అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడని మీరు అనుకుంటారు. మీరు పెళ్ళికి ఒప్పుకోలేదు
కాబట్టి ఆ అబ్బాయి మీ ఇంటికొచ్చి మీ అమ్మాయిని ఎవరు కావాలో తేల్చుకో మంటాడు. ఆమె
వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు తీయబోయే షాట్ లో ఈ వాక్యానికి అభినయం చేయాలి: ‘చేతిని విదిలించి కోపంగా కదిలిపోతుంటే, దూరమవుతున్న ఆత్మీయతను చూసి
గుండె భారమైంది’. ఇది తండ్రి మనసులోని ఆవేదనని అవిష్కరించేలా ఆక్ట్ చేయాలి”, అని
వివరించాడు అసిస్టెంట్ డైరెక్టర్. చిన్న చిన్న వేషాలు వేసే వీరబాబు దీనికి ముందు షాట్
గుర్తు చేసుకున్నాడు: వీరబాబు హీరోయిన్ చెయ్యి పట్టుకుని, “ఇన్నేళ్ళ ప్రేమని
కాదనుకుని నిన్నగాక మొన్న నీ జీవితంలోకొచ్చి, నిన్ను మాయ మాటలతో భ్రమపెట్టే వీడు
ఎక్కువైపోయాడా?” అని ఆర్ద్రతతో అన్నాడు, కోపంతో కాదు.
అప్పుడు, అలోచించి, ఇలా చేస్తే
బాగుంటుందా, అని అసిస్టెంట్ డైరెక్టర్ ని అడిగాడు. అతను ఓకే చెప్పగానే కెమెరా ఆన్
చేసి షాట్ తీయడం మొదలెట్టారు. ప్రేమ మైకం కమ్మిన హీరోయిన్, తండ్రికేసి చూసి, చేతిని విదిలించి కోపంగా కదిలిపోతుంటే, దూరమవుతున్న ఆత్మీయతను చూసి వీరబాబు దుఃఖంతో నేలకూలాడు. “కట్”, అన్న మాట
వినపడినా కూడా వీరబాబు లేవలేదు. నిజ జీవితంలో తన కూతురు తనకు ఇష్టంలేని పెళ్ళి
చేసుకుని, తండ్రి మనసుకి
పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయిందంటే, జూనియర్ ఆర్టిస్ట్ అయిన తనని ఓదార్చే వాళ్ళెవరు? అందుకే, ఈ పాత్రలో
జీవించి, తన దుఃఖాన్ని వెళ్ళగక్కుకుంటున్నాడు!
***************
No comments:
Post a Comment